జూనియర్ ఎన్టీఆర్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటూ సోషల్ మీడియాలో విరాళాలు సేకరిస్తున్న ఘటనలపై ఎన్టీఆర్ టీమ్ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. గత కొంతకాలంగా వాట్సాప్ గ్రూపులు, ఎక్స్ , ఫేస్‌బుక్ వేదికగా ఎన్టీఆర్ ఛారిటీ, తారక్ ఫ్యాన్స్ సేవా సమితి వంటి పేర్లతో కొందరు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రజల నుంచి, అమాయక అభిమానుల నుంచి భారీగా విరాళాలు తీసుకుంటున్న విషయం ఎన్టీఆర్ టీమ్ దృష్టికి చేరింది.
కొన్ని ఫ్యాన్ గ్రూపులు ఎన్టీఆర్ పేరు వాడుతూ విరాళాలు సేకరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది. ఈ తరహా కార్యకలాపాలతో ఎన్టీఆర్ గారికి కానీ, ఆయన అధికారిక కార్యాలయానికి కానీ ఎలాంటి సంబంధం లేదని తారక్ కార్యాలయం స్పష్టం చేసింది. ఇలాంటి వాటిని ఆయన ఏమాత్రం ప్రోత్సహించరు అని టీమ్ స్పష్టం చేసింది. ఎన్టీఆర్ తరఫున ఏదైనా సేవా కార్యక్రమం జరిగితే అది ఆయన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే వస్తుందని స్పష్టం చేసింది. ఎవరైనా తారక్ ఫోటోలు చూపిస్తూ చందాలు అడిగితే గుడ్డిగా నమ్మవద్దని ఎన్టీఆర్ టీమ్ పేర్కొంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయన పేరును దుర్వినియోగం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

