నేరస్తుడు ఎంత తెలివిగలవాడైనా ఏదో ఒక చిన్న ఆధారాన్ని వదిలి వెళ్తాడనే దానికి నిదర్శనంగా, ఒక మహిళ ఫిర్యాదుపై అమలాపురం పోలీసులు మెరుపు వేగంతో స్పందించారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే అంతర్రాష్ట్ర మహిళా గజదొంగను అరెస్ట్ చేసి, రూ. 25 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
అమలాపురానికి చెందిన తాటికొండ సత్యదేవి అనే మహిళ ఆటోలో ప్రయాణిస్తుండగా ఆమె హ్యాండ్ బ్యాగ్ నుండి భారీగా నగలు చోరీకి గురయ్యాయి. అలాగే పెయ్యల శాంతి అనే మరో మహిళ బ్యాగ్ కూడా ఆటోలో మాయమైంది.తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన బండి శివ పార్వతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిపై గతంలో కర్నూలు, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక దొంగతనం కేసులు ఉన్నాయి. ఆటోలు, బస్సుల్లో ప్రయాణీకుల లగేజీని టార్గెట్ చేయడం ఈమె స్టైల్. నిందితురాలి నుండి మూడు కేసులకు సంబంధించి సుమారు 141.350 గ్రాముల బంగారు ఆభరణాలను (విలువ రూ. 20.50 లక్షల పైచిలుకు) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సకాలంలో స్పందించి కేసును ఛేదించిన అమలాపురం డీఎస్పీ ప్రసాద్, సీఐ వీరబాబు మరియు క్రైమ్ టీంను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రయాణాల్లో అపరిచిత మహిళలతో జాగ్రత్తగా ఉండాలని మహిళలకు ఎస్పీ సూచించారు.
