ఏపికి అమరావతే ఏకైక రాజధాని

April 1, 2026 7:15 PM

అమరావతి BNS ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక అమరావతే ఏకైక రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎవరూ అంగుళం కూడా రాజధానిని కదల్చలేరని ఆయన అన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి… ప్రజావేదిక సభలో ప్రసంగించారు. ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని.. లోక్‌సభలో చట్టబద్దత బిల్లుకు ఆమోదం పొందటం ఆంధ్రులకు దక్కిన గౌరవమని సీఎం అన్నారు. బిల్లు ఆమోదంతో అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందని తెలిపారు. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి.. ఈ బిల్లుకు మద్దతు పలికిన పార్టీలకు రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియచేశారు. గత పాలకులు మూడు ముక్కలాటతో విధ్వంసం చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆక్షేపించారు. రాజధానికి చట్టబద్దత కల్పించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం పెడితే కనీసం శాసనసభ సమావేశాలకు కూడా ఆ పార్టీ హాజరు కాలేదన్నారు. రాజధాని ప్రాంతాన్ని స్మశానమని, ఏడారి అని, ముంపు ప్రాంతమని ఎగతాళి చేసి ఆనందించారని సీఎం ఆరోపించారు.

సంక్షేమానికి పెద్దపీట

ప్రతీ నెలా మొదటి తేదీన పేదల సేవలో ద్వారా పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు అంతా పేదల సేవలో ఉంటున్నామని తెలిపారు. ప్రతీ నెలా రూ.2,750 కోట్లను పెన్షన్ల కోసం వ్యయం చేస్తున్న ప్రభుత్వం ఏపీనే అని సీఎం వివరించారు. పొరుగున తమిళనాడులో కేవలం రూ. వెయ్యి మాత్రమే పెన్షన్ గా ఇస్తున్నారని అన్నారు. ప్రజలపై ఉన్న అభిమానం తోనే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల్ని చేయగలుగుతున్నామని సీఎం వివరించారు. గత ఏడాది జూన్ లో తల్లికి వందనం కింద ఆర్ధిక సహకారం అందించామని.. ఈ ఏడాది జూన్ లోనూ తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని తెలిపారు. దీపం 2.0 కింద ఏడాదికి 3 ఉచిత సిలెండర్లను ఇస్తున్నామని త్వరలోనే ప్రతీ ఇంటికీ పైప్ ద్వారా గ్యాస్ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. దీని కోసం ఏడాదికి రూ.2400 సబ్సీడిని కూడా వినియోగదారుల ఖాతాల్లో వేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అడ్వాన్సుగా రూ.1300 కోట్లను ఇచ్చిందని గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు పీ4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. 25 వేల కుటుంబాల్ని దత్తత తీసుకునేందుకు అదానీ ట్రస్టు కూడా ముందుకు వచ్చిందని ముఖ్యమంత్రి వివరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media