AMARAVATI తుఫానుల మధ్య భూసేకరణ హెచ్చరికలా? అమరావతి రైతుల ఆవేదన : ’33 వేల ఎకరాలున్నా మా భూమే కావాలా?’

December 13, 2025 3:55 PM

రాజధాని అమరావతిలో రైతులు భారీ వర్షాలు, తుఫానుల కారణంగా పంట నష్టం, ఇళ్ల ముంపుతో అల్లాడుతుండగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన తాజా ప్రకటన వారి ఆగ్రహాన్ని పెంచింది. ఇప్పటికే 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్‌కు సేకరించిన నేపథ్యంలో, ఇంకా ఇవ్వని 2,400 ఎకరాలకు సైతం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి హెచ్చరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వంపై ప్రశ్నలు “మా పొలాలు, ఇళ్లు వర్షాలకు నీట మునిగి కష్టాల్లో ఉన్నాం. ఈ సమయంలో ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించకుండా, భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తామని బెదిరిస్తోంది. ఇప్పటికే 33,000 ఎకరాలు సేకరించారు కదా! ఆ భూమిలో నిర్మాణాలు పూర్తి చేయకుండా, మళ్లీ మా భూమే ఎందుకు కావాలి?” అని ల్యాండ్ పూలింగ్‌లో భూమి ఇవ్వని రైతులు ప్రశ్నిస్తున్నారు.ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరించని సుమారు 2,400 ఎకరాల రైతులు చర్చలకు సిద్ధం కాకపోతే, వచ్చే నెల మొదటి వారంలో భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి స్పష్టం చేయడాన్ని రైతులు ఒత్తిడి రాజకీయాలుగా అభివర్ణిస్తున్నారు.
తుఫానుల సమయంలో ముంపు సమస్య తీవ్రంగా ఉన్నా, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆలస్యం జరుగుతోంది. కేవలం డీపీఆర్ ప్రకారం పనులు, సరిహద్దు రాళ్ల ఏర్పాటుపై హామీలు ఇస్తున్నారే తప్ప, రైతుల ప్రాథమిక కష్టాలు తీర్చడం లేదని విమర్శలు వస్తున్నాయి.

వీధి పోటు వంటి సమస్యలు ఉన్న ప్లాట్లకు ఒక్కసారి మాత్రమే మార్పులు చేసే అవకాశం ఇస్తామని, ‘ప్రతి నెలా వాస్తు మార్పులు సాధ్యం కాదని’ మంత్రి తేల్చి చెప్పడం సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి లేకపోవడాన్ని సూచిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడికొండ బైపాస్ నిర్మాణం వల్ల నష్టపోయిన రైతులకు టీడీఆర్(T.D.R) బాండ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, జరీబు భూముల సమస్య పరిష్కారానికి నెల రోజుల గడువు తీసుకోవడం సమస్యల పరిష్కారంలో జాప్యానికి నిదర్శనమని రైతులు మండిపడుతున్నారు.

ఒకవైపు ప్రకృతి వైపరీత్యాల కష్టాలు, మరోవైపు భూసేకరణ హెచ్చరికలతో రాజధాని ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వేలాది ఎకరాలు అందుబాటులో ఉన్నా, మళ్లీ భూమి కోసం ఒత్తిడి తేవడంపై ప్రభుత్వం తన వైఖరిని పునఃసమీక్షించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media