అక్రమ చొరబాట్లు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు
న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే బలమైన అంతర్గత భద్రత వ్యవస్థే పునాది అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
న్యూఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహించిన జాతీయ భద్రతా వ్యూహాత్మక సదస్సు ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా 2047 నాటికి దేశ అంతర్గత భద్రతను మరింత పటిష్టం చేసేందుకు 20 ఏళ్ల బ్లూప్రింట్‌ను ఆవిష్కరించారు.
‘‘మన దేశమేమీ ధర్మశాల కాదు’’
అక్రమ చొరబాట్లపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ‘‘ఈ దేశం ఏమీ ధర్మశాల కాదు.
ఇక్కడ నివసించే హక్కు కేవలం ఈ దేశ పౌరులకు మాత్రమే ఉంది’’ అని తేల్చిచెప్పారు.
అక్రమ చొరబాటుదారులు దేశ భద్రతతో పాటు ఆర్థిక స్థిరత్వం, జనాభా ఆధారిత సామాజిక సమతుల్యతకు ముప్పుగా మారుతున్నారని హెచ్చరించారు.
గత ఎనిమిది నెలలుగా సరిహద్దు రాష్ట్రాలతో చర్చలు జరిపి నాలుగు అంచెల సరిహద్దు భద్రతా చట్రాన్ని సిద్ధం చేశామని అమిత్ షా తెలిపారు.
అతి తక్కువ సమయంలోనే భారత్‌ను అక్రమ చొరబాటురహిత దేశంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
ఉగ్రవాదం, నక్సలిజంపై విజయం
నక్సలిజం, ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి, నార్కోటిక్స్ వంటి సవాళ్లను గత ప్రభుత్వాలు ప్రారంభంలోనే అంచనా వేసి అడ్డుకోలేకపోయాయని అమిత్ షా అన్నారు.
దీనివల్ల దేశం దశాబ్దాల పాటు అనేక సమస్యలను ఎదుర్కొందని చెప్పారు.
ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలు, రాష్ట్ర పోలీసు బలగాల సమన్వయంతో ఈ మూడు ప్రధాన అంతర్గత భద్రతా ముప్పులను విజయవంతంగా అధిగమించిందని తెలిపారు.
పీఎఫ్ఐ నిషేధం తర్వాత చేపట్టిన చర్యలు కేంద్ర, రాష్ట్రాల మధ్య సమర్థవంతమైన సమన్వయానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఉగ్ర నెట్‌వర్క్‌లను పూర్తిగా ధ్వంసం చేసేందుకు ‘ప్రహార్’ వ్యూహాన్ని రోజువారీ భద్రతా చర్యల్లో భాగం చేయాలని భద్రతా దళాలకు సూచించారు.
మాదకద్రవ్యాలపై ‘డిటెక్ట్, డిస్రప్ట్ అండ్ డిస్ట్రాయ్’
మాదకద్రవ్యాల నివారణకు ‘డిటెక్ట్, డిస్రప్ట్ అండ్ డిస్ట్రాయ్’ వ్యూహాన్ని అమలు చేయాలని అమిత్ షా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.
మాదకద్రవ్యాలను గుర్తించడం, అడ్డుకోవడం, ధ్వంసం చేయడంపై దృష్టి పెట్టాలని చెప్పారు.
నార్కోటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్ 2026-2029ను క్షేత్రస్థాయిలో అమలు చేసి భవిష్యత్తు తరాలను రక్షించాలని సూచించారు.
274 మంది ఆర్థిక నేరస్థులు, పరారీలో ఉన్న నిందితుల అప్పగింత
2019 నుంచి 2026 మధ్య దాదాపు 274 మంది ఆర్థిక నేరస్థులు, పరారీలో ఉన్న నిందితులను విదేశాల నుంచి భారత్‌కు రప్పించామని అమిత్ షా వెల్లడించారు.
విదేశాల్లో దాక్కున్న నేరస్థులందరినీ చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు.
ముందస్తు వ్యూహాలు, సమగ్ర చర్యలతోనే సురక్షితమైన, చొరబాటురహిత భారత నిర్మాణం సాధ్యమని అమిత్ షా చెప్పారు.



