ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం 70వ రోజుకు చేరుకుంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రజాదర్బార్లో లోకేశ్ స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను ఓపికగా విన్నారు. సుమారు 2 వేల మందిని కలసి వినతిపత్రాలు స్వీకరించిన ఆయన, సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలతో ఆప్యాయంగా ముచ్చటించిన లోకేశ్, ఫోటోలు దిగుతూ స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పారు. క్యూలో ఉన్న చివరి వ్యక్తిని కలిసే వరకు ప్రజాదర్బార్ కొనసాగుతుందని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రజల సమస్యల పరిష్కారమే తన తొలి ప్రాధాన్యత అని లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు.

