వ్యవసాయంలో యూరియాను విచక్షణారహితంగా వాడటం వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా, పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మి దేవి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ, రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటించాలని సూచించారు.

శాస్త్రీయంగా నత్రజని, భాస్వరం, పొటాష్ నిష్పత్తి 4:2:1 ఉండాలి. కానీ, ప్రస్తుతం రైతులు 7:2.8:1 నిష్పత్తిలో యూరియాను వాడుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని ఆమె పేర్కొన్నారు. అతిగా యూరియా వాడటం వల్ల పెట్టుబడి ఖర్చు పెరగడమే కాకుండా, తెగుళ్ల ఉధృతి పెరుగుతుందని, నీరు మరియు వాతావరణం కాలుష్యమవుతాయని తెలిపారు. కేవలం 500 మిల్లీలీటర్ల నానో యూరియా బాటిల్, 45 కిలోల బస్తా యూరియాతో సమానమని.. రైతులు దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. భూసార పరీక్షలు నిర్వహించి 20% వరకు యూరియా వాడకాన్ని తగ్గించవచ్చని, వేప పూత పూసిన (Neem Coated) యూరియా వాడటం వల్ల మొక్కలకు ఎక్కువ కాలం నత్రజని అందుతుందని వివరించారు.
“యూరియా పంటకు మందు లాంటిది, మోతాదు మించితే అది విషంగా మారుతుంది” అని శారద జయలక్ష్మి స్పష్టం చేశారు.
