శ్రీకాకుళం కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన పది మంది యాత్రీకులు ప్రయాణిస్తున్న వాహనం రహదారిపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.
పూరీ జగన్నాథ స్వామి దర్శనం అనంతరం యాత్రీకులు శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన ఆరుగురిలో డ్రైవర్ సునీల్ పటేల్, సంతోషి భాయ్, సీమన్ భాయ్, చీరా భాయ్, సావిత్రి భాయ్, శకుంతల భాయ్, తోమార్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా నరసన్నపేట ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కోటబొమ్మాళికి పంపించారు.
ప్రమాద సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆగిఉన్న లారీని ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. రాత్రి వేళ డ్రైవింగ్‌లో జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


