అనంతపురం జిల్లా యాడికి మండలంలో ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కోన ఉప్పలపాడు గ్రామానికి చెందిన హేమచంద్ర (5)ను గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆస్తి వివాదం కారణంగా కుటుంబ సభ్యుడే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిట్టూరు గ్రామానికి చెందిన బోయ సర్వేశ్ ఈ ఘటనలో ప్రధాన అనుమానితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై ముఖానికి మాస్క్ ధరించి బాలుడిని అపహరించి, అనంతరం యాడికి మండలం కుందనకోట గ్రామ శివారులోకి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.గురువారం ఘటనపై సమాచారం అందడంతో సంఘటనా స్థలాన్ని రోహిత్ కుమార్ చౌదరి పరిశీలించారు. బాలుడి మృతదేహం గుర్తించడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
