జిల్లా ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రీజినల్ మేనేజర్ (RM) కార్యాలయ భవన నిర్మాణానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ పూల నాగరాజు గురువారం భూమి పూజ నిర్వహించారు.

రూ. 2 కోట్ల వ్యయంతో ఆర్ఎం కార్యాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టాలెక్కించిందని ఎమ్మెల్యే తెలిపారు.
అనంతపురం నగర ప్రయాణికుల కోసం 10 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. ఇవి త్వరలోనే సిటీ సర్వీసులుగా అందుబాటులోకి రానున్నాయి. పూల నాగరాజు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక రీజన్ పరిధిలో రూ. 20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. గత ఐదేళ్లలో నిర్వీర్యమైన ఆర్టీసీని పునర్నిర్మిస్తూనే, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఛైర్మన్ స్పష్టం చేశారు.
అనంతపురం ఆర్టీసీని ప్రయాణికులకు మరింత చేరువ చేస్తూ, అత్యాధునిక వసతులతో బస్టాండ్‌ను తీర్చిదిద్దుతామని నేతలు భరోసా ఇచ్చారు.
