రాష్ట్రంలోని BC ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ హాస్టళ్లు మరియు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా మెస్ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే పూసపాటి ఆదితి విజయలక్ష్మి అడిగిన ప్రశ్నకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత సమాధానమిచ్చారు.ప్రస్తుత ధరలకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ఛార్జీల పెంపుపై నోడల్ శాఖ (సాంఘిక సంక్షేమ శాఖ)తో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కొత్తగా మరో 10 గురుకులాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ. 110 కోట్ల డైట్ ఛార్జీల బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుదల చేసిందని మంత్రి గుర్తు చేశారు.హాస్టళ్లలో కేవలం ఆహారమే కాకుండా సీసీ కెమెరాలు, ఆర్ఓ ప్లాంట్లు, ఇన్వర్టర్లు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని, అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణానికి రూ. 80 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.నారా లోకేష్ చొరవతో విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, బీసీ బిడ్డల చదువుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సవిత స్పష్టం చేశారు.
