ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2026-27 వార్షిక బడ్జెట్ నేపథ్యంలో, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులపై వెలగపూడి సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించేందుకు రూ. 150 కోట్లు కేటాయించాలని మంత్రి దుర్గేష్ ప్రతిపాదించారు. విశాఖపట్నం, తిరుపతి నగరాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రత్యేక నిధులు కేటాయించాలని చర్చించారు. ప్రసాద్, స్వదేశీ దర్శన్ 2.0, ‘పూర్వోదయ’ వంటి కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులను సమర్థవంతంగా వాడుకుని కనెక్టివిటీని మెరుగుపరచాలని నిర్ణయించారు. 2014-19 కాలానికి సంబంధించిన పాత బకాయిల చెల్లింపులపై ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారు.కేవలం ప్రధాన నగరాలే కాకుండా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.ఈ సమావేశంలో పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పీపీపీ విధానంలో సాగుతున్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
