కలియుగ ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలను వచ్చే ఏడాది జనవరిలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈసారి ఉత్సవాలను కేవలం ఒక రోజుకే పరిమితం చేయకుండా వారం రోజుల పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలుగా జరపాలని నిర్ణయించారు.

జనవరి 25న ప్రధాన రథసప్తమి వేడుక జరగనుండగా దానికి వారం రోజుల ముందు అంటే జనవరి 19 నుండే ఉత్సవాలు ప్రారంభం కావాలని మంత్రి ఆదేశించారు. జనవరి 23, 24, 25 తేదీలలో వేడుకలను మరింత అట్టహాసంగా నిర్వహించాలని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను ఆహ్వానించాలని సూచించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు క్రీడలు, సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాలను కూడా ఈ ఉత్సవాల్లో భాగం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డిలతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళికతో నివేదిక సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
