అమరావతి,10 ఫిబ్రవరి (బీఎన్ఎస్): ఈనెల 11వ తేది బుధవారం నుండి జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఎపి అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సకాలంలో సమాధానాలు పంపాలని అధికారులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. వచ్చే వర్షాకాల సమావేశాలను నేషనల్ ఇ-విధాన్ కింద డిజిటల్ విధానంలో సభ నిర్వహణకు కృషి జరుగుతోందని చెప్పారు. ఇంకా ఈసమావేశంలో సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు అందుకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం సహకారం తదితర అంశాలపై చర్చించారు.
ఈసమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్,ఉప శాసన సభాపతి కె.రఘ రామకృష్ణ రాజు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఎస్ మీ.ప్రసన్న కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కృష్ణ బాబు, ఎస్ ఎస్ రావత్, ఆర్పి సిసోడియా,ఎక్స్ అఫిషియో స్పెషల్ సిఎస్ బి.రాజశేఖర్, పలువురు ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు తదితర అధికారులు పాల్గొన్నారు.
