ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మక చర్యలు చేపట్టింది. శాసనసభలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ, రాష్ట్రంలోని హార్బర్లు మరియు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల (FLC) పురోగతిని వివరించారు.
రాష్ట్రంలో 1053 కి.మీ తీరప్రాంతం ఉండగా, పది ఫిషింగ్ హార్బర్లను అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్నారు.జువ్వలదిన్నె, ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, వోడరేవు హార్బర్లు ప్రతిపాదిత దశలో ఉన్నాయి. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో మినీ జెట్టి నిర్మాణం కోసం CICEF ఇప్పటికే ప్రీ-ఫీజిబిలిటీ అధ్యయనం పూర్తి చేసింది. నివేదిక అందగానే తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మరియు సాగరమాల సహకారంతో రూ. 178.51 కోట్లతో విశాఖ హార్బర్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భీమిలి, రాజయ్యపేట, చింతపల్లి వంటి ప్రాంతాల్లో రూ. 126.91 కోట్లతో కొత్త ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధి టెండర్ల దశలో ఉంది.మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
