బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై 18 శాతం ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తూ (0% కి తగ్గిస్తూ) కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఏపీ ప్రభుత్వం స్వాగతిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది పొగాకు రైతులకు, చిన్న వ్యాపారులకు వరంగా మారనుందని ఆయన పేర్కొన్నారు.
HS కోడ్ 2401 కిందకు వచ్చే అన్‌బ్రాండెడ్, ప్యాక్ చేయని ముడి పొగాకుపై ఇకపై ఎటువంటి ఎక్సైజ్ డ్యూటీ ఉండదు.గతంలో నిబంధనల విషయంలో ఉన్న అస్పష్టత వల్ల రైతులు, వ్యాపారులు పన్ను ఇబ్బందులు ఎదుర్కొనేవారని, తాజా గెజిట్‌తో ఆ గందరగోళం తొలగిపోయిందని మంత్రి వివరించారు.బల్క్ ముడి పొగాకుపై పన్ను లేకపోవడం వల్ల మార్కెట్లో రైతులకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంది. కంపెనీ బ్రాండ్‌తో చిన్న ప్యాకెట్లుగా విక్రయించే పొగాకు ఉత్పత్తులపై మాత్రం గతంలోలాగే 18 శాతం ఎక్సైజ్ సుంకం కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 1, 2026న విడుదల చేసిన ఈ గెజిట్ ద్వారా ముడి పొగాకు సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
