ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా మార్చడమే లక్ష్యమని, పర్యాటక రంగాన్ని రాష్ట్రానికి ‘క్రియేటివ్ ఎకానమీ’గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో నిర్వహించిన ‘ఆవకాయ్-అమరావతి ఫెస్టివల్’కు ఆయన యూరోపియన్ యూనియన్ (EU) రాయబారి హెర్వే డెల్ఫీతో కలిసి హాజరయ్యారు.

కృష్ణా నదిలో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ హౌస్ బోట్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం ఈయూ రాయబారి తో కలిసి కృష్ణా హారతిని తిలకించారు. ఆవకాయ్ కేవలం ఆహారం కాదు, మన సంస్కృతికి చిహ్నమని.. ప్రపంచంలో ఎక్కడ హోటల్ ఉన్నా అక్కడ ఏపీ షెఫ్ ఉండటం మన గొప్పతనమని కొనియాడారు. రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో లక్ష గదులను పర్యాటకానికి అందుబాటులోకి తెస్తామని, సూర్యలంక బీచ్‌ను గోవా తరహాలో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. భక్త ప్రహ్లాద నుండి బాహుబలి వరకు తెలుగు సినిమా క్రియేటివిటీకి నిదర్శనమని, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, బాలయ్య వంటి హీరోలు మన సినిమాకు వన్నె తెచ్చారని అన్నారు. అమరావతి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డైనమిక్ గ్రీన్ ఫీల్డ్ సిటీగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ లీడింగ్ స్టేట్‌గా ఉందని ఈయూ రాయబారి హెర్వే డెల్ఫీ ప్రశంసించారు. రాజమౌళి సినిమాలు, నాటు నాటు పాట తనను ఎంతో ఆకర్షించాయని, త్వరలోనే ఏపీలో ‘ఈయూ ఫిలిం ఫెస్టివల్’ నిర్వహిస్తామని తెలిపారు.

