కృష్ణా నది తీరం పర్యాటక శోభతో మెరిసిపోతోంది. జనవరి 8 నుండి 10 వరకు విజయవాడలోని పున్నమిఘాట్, భవాని ఐల్యాండ్ వేదికలుగా ‘ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్’ నిర్వహించనున్నారు. ఈ వేడుకల ఏర్పాట్లను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, APTDC M.D ఆమ్రపాలి, కలెక్టర్ లక్ష్మీ శ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేలా రూపొందించిన హౌస్ బోట్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపుప్రారంభించనున్నారు. త్వరలోనే గోదావరి తీరంలోనూ వీటిని ప్రవేశపెడతామని మంత్రి తెలిపారు.

ఈ ఫెస్టివల్లో DYCM పవన్ కళ్యాణ్ పాల్గొంటారని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. తెలుగు సంస్కృతి, కళలు, సాహిత్యం మరియు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో సంగీత విభావరి, సాహిత్య చర్చలు, కవితా పఠనాలు, నాటకాలు మరియు ఫుడ్ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

సినిమా, సాహిత్య రంగాలకు చెందిన దిగ్గజాలు, ప్రపంచవ్యాప్త కళాకారులు ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. రాష్ట్ర సంస్కృతిని కాపాడుతూనే పర్యాటక రంగాన్ని ఆర్థిక వృద్ధి పథంలో నడిపించాలన్న CM, డిప్యూటీ CMల దూరదృష్టికి ఈ ఫెస్టివల్ నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
