తిరుపతి జిల్లా తిరుచానూరులో జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఇవాళ పంచమీ తీర్థంతో ముగుస్తున్నాయి. చివరి రోజైన పంచమీ తీర్థానికి 3–4 లక్షల మంది భక్తులు చేరుకునే అవకాశంతో టిటిడి విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.
భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, బ్యారికేడ్లు, సూచిక బోర్డులు, ప్రవేశ–నిష్క్రమణ గేట్లు ఏర్పాటు చేయగా, భద్రత కోసం 600 మంది టిటిడి సిబ్బంది, 200 మంది స్కౌట్స్, 200 మంది ఎన్‌సిసి విద్యార్థులు, 900 మంది శ్రీవారి సేవకులు, 1600 మంది పోలీసులు మోహరించారు.
అన్నప్రసాదాల కోసం మొత్తం 150 కౌంటర్లు ఏర్పాటు చేశారు. త్రాగునీరు, అల్పాహారం, మజ్జిగ వంటి సేవలు క్యూలైన్లలో అందుబాటులో ఉంచారు. 284 శాశ్వత, తాత్కాలిక, మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేసి అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు.
భక్తుల రాకపోకలు సులభంగా ఉండేందుకు శిల్పారామం, తనపల్లి క్రాస్, మార్కెట్‌యార్డు, పూడి జంక్షన్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రముఖులకు ప్రత్యేక పార్కింగ్‌ను పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేశారు.
బ్రహ్మోత్సవాల వీక్షణ కోసం దేశవ్యాప్తంగా టిటిడి ఆలయాల్లో 25 ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయగా, ఇవాళ పంచమీ తీర్థం కోసం అదనంగా 34 స్క్రీన్లు, పద్మసరోవరం వద్ద 4 స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
జడ్పీ హైస్కూల్, పూడి ఏరియా, నవజీవన్ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన హోల్డింగ్ పాయింట్ల నుండి మాత్రమే భక్తులను పద్మసరోవరంకి అనుమతించనున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు కుంభలగ్నంలో చక్రస్నానం మహోత్సవం జరుగుతుంది.
