ప్రముఖ సినీ హాస్యనటుడు, పద్మశ్రీ బ్రహ్మానందంకు తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో జరిగిన తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవంలో ‘బొల్లిముంత శివరామకృష్ణ జాతీయ స్థాయి జీవితకాల పురస్కారంను ప్రదానం చేశారు.

ఆదివారం సాయంత్రం జరిగిన సభలో నిర్వాహకులు బ్రహ్మానందంకు లక్ష రూపాయల నగదుతో పాటు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందజేశారు. 49 ఏళ్ల క్రితం తన వివాహం తెనాలిలోని వైకుంఠపురంలోనే జరిగిందని, ఈ ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా బ్రహ్మానందం గుర్తు చేసుకున్నారు.
పురస్కారం స్వీకరించడానికి ముందు, ఆయన వైకుంఠపురం దేవస్థానాన్ని సందర్శించి, శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్ అనుపమ, అర్చకులు అళహరి రవికుమార్, సిబ్బంది పూర్ణకుంభంతో బ్రహ్మానందంకు స్వాగతం పలికారు. వేద పండితులు ఆయనకు స్వామి వారి ఆశీస్సులు అందజేశారు.
