మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు 6 జిల్లాల్లో 373 ఘాట్లు

February 27, 2026 12:09 PM

2027లో జరగబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, ‘మహా కుంభమేళా’ తరహాలో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సచివాలయంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నారాయణ తదితరులతో కూడిన మంత్రివర్గ ఉప సంఘం శుక్రవారం భేటీ అయ్యింది.

2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈసారి 10 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కేవలం రాజమండ్రి, కొవ్వూరు వంటి ప్రాంతాల్లోనే దాదాపు 9.60 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందని మంత్రి ఆనం తెలిపారు. గోదావరి ప్రవహించే 6 జిల్లాల్లో మొత్తం 373 స్నాన ఘట్టాలను (369 శాశ్వత, 4 తాత్కాలిక) ఏర్పాటు చేయనున్నారు. తొలి ఘాట్ పోలవరం జిల్లాలోని గుండాల కాగా, చివరిది అంతర్వేది, బలుసుతిప్ప వద్ద ఉంటుంది. భక్తుల కోసం టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేయనున్నారు. 391 ఆలయాలకు మరమ్మతులు, 43 ఆలయాలకు ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. చివరి నిమిషంలో హడావుడి లేకుండా, నాణ్యతతో కూడిన ఘాట్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు ముందే పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పుష్కరాలు జరిగే 6 జిల్లాల జాయింట్ కలెక్టర్లు (JC) నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు.త్వరలోనే ఈ వివరాలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు ఉంచి, తుది ప్రణాళికను ఖరారు చేయనున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media