చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. జంగారెడ్డిగూడెం వెళ్లే మార్గంలో కొత్తగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేపై ఆయన తన అనుచరులతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
రేచర్ల సమీపంలో హైవే పనులను పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే, అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ముగ్ధులయ్యారు. వెంటనే తన అనుచరులతో కలిసి ‘దురంధర్’ మ్యూజిక్కు డాన్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్ చేశారు. ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న ఈ గ్రీన్ఫీల్డ్ హైవే దాదాపు పూర్తి కావొచ్చింది. పచ్చని పొలాల మధ్య అత్యంత సుందరంగా ఉన్న ఈ రహదారిని చూసి సరదాగా డ్యాన్స్ చేయాలనిపించిందని ఎమ్మెల్యే తెలిపారు. కొందరు ఎమ్మెల్యే ఉత్సాహాన్ని మెచ్చుకుంటుండగా, మరికొందరు ప్రజా సమస్యలు వదిలేసి రోడ్లపై డాన్సులేంటని విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఈ ‘సింగమ్’ స్టైల్ స్టెప్పులు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి
