AP : రూ.260 కోట్లతో టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ

November 27, 2025 3:15 PM

అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులు తిరుమల స్థాయిలో చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆలయ విస్తరణకు మొత్తం రూ.260 కోట్లు వెచ్చించి, రెండు దశల్లో రెండున్నరేళ్లలో పనులు పూర్తిచేయాలని టీటీడీని ఆదేశించారు.

వెంకటపాలెంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. మొదటి దశలో రూ.92 కోట్లతో ప్రాకారం, రూ.48 కోట్లతో ఏడంతస్తుల మహారాజ గోపురం, వివిధ మండపాలు, పుష్కరిణి, కట్‌స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. రెండో దశలో రూ.120 కోట్లతో మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, విశ్రాంతి భవనం, అర్చకుల–సిబ్బంది క్వార్టర్లు, పరిపాలనా భవనం, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తారు.

రాజధాని నామకరణం నుండి ఆలయ నిర్మాణం వరకు అన్నీ వేంకటేశ్వరుని కృప వల్లే సాధ్యమైందని సీఎం పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన 29 వేల మంది రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం ఆలయాభివృద్ధికి అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు.

తాను చిన్నతనం నుండి శ్రీవారిపై గాఢభక్తి కలిగినవాడినని, తిరుమలలో స్వచ్ఛందంగా క్యూలో నిలబడి దర్శనం చేసుకుంటానని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ముంబయి రేమాండ్స్ సంస్థ రూ.100 కోట్లతో ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్నదని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు అనం రామనారాయణరెడ్డి, నారాయణ, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యేలు, టీటీడీ సభ్యులు, రైతులు, భక్తులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media