రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు.ప్రముఖ ఆర్థిక దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ (ET) ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు చంద్రబాబు ఎంపికైన సందర్భంగా ఎంపీలు ఆయనను ఘనంగా సన్మానించారు. సంప్రదాయబద్ధంగా బొబ్బిలి వీణను కానుకగా అందించి గౌరవించారు.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు (డిసెంబర్ 18) సందర్భంగా విమానాశ్రయంలోనే ఆయనతో సీఎం కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు నేడు (శుక్రవారం) అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ సహా ఆరుగురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలపై ఆయన చర్చలు జరపనున్నారు.
