గత ప్రభుత్వ హయాంలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టి, సుపరిపాలనతో ప్రజల్లో మళ్లీ విశ్వాసాన్ని నింపామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిని వివరించారు.
సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ‘తల్లికి వందనం’ ద్వారా రూ. 10,090 కోట్లు, ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ. 6,310 కోట్లు జమ చేశామని తెలిపారు. ఏడాదిన్నరలో రూ. 50 వేల కోట్ల సామాజిక పెన్షన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించామన్నారు.

పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. గోదావరి జలాలను రాయలసీమకు మళ్లించే నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని, దీనివల్ల తెలంగాణ కూడా లాభపడుతుందని స్పష్టం చేశారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25% ఏపీకే రావడం గర్వకారణమన్నారు. గూగుల్ $15 బిలియన్ల పెట్టుబడితో విశాఖలో AI డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని, SIPB ద్వారా 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు. అమరావతిలో త్వరలోనే ‘క్వాంటం వ్యాలీ’కి శంకుస్థాపన చేస్తామని, ఆరు నెలల్లోనే క్వాంటం కంప్యూటర్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు, కేంద్ర సహకారంతో రూ. 12 వేల కోట్ల సాయం అందించి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకున్నామని, ఆంధ్రుల సెంటిమెంట్ అయిన ప్లాంట్ ను నిలబెట్టి తీరుతామని హామీ ఇచ్చారు.
