రాష్ట్రంలోని పత్తి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి కిలో పత్తి కొనుగోలు అయ్యేలా ప్రభుత్వం పూర్తి హామీ ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. పేరేచెర్ల, సత్తెనపల్లి సీసీఐ కొనుగోలు కేంద్రాలను మంత్రి స్వయంగా సందర్శించి, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. తేమ శాతం, యాప్ సమస్యలు, L1–L4 గ్రేడింగ్ పై వివరాలు సేకరించారు.

ఆకస్మిక వర్షాల వల్ల పత్తి నాణ్యత దెబ్బతిన్న నేపథ్యంలో, సీసీఐ కఠిన నిబంధనలు రైతులకు సమస్యగా మారాయని మంత్రి తెలిపారు. ఇప్పటికే కేంద్రంతో మాట్లాడి గ్రేడింగ్ నిబంధనలను పునఃసమీక్షించాలంటూ కోరినట్టు తెలిపారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో జరిగిన చర్చల్లో, సీసీఐ అదనపు మిల్లులను తెరవడానికి అంగీకరించిందని మంత్రి చెప్పారు. డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని మిల్లులు పూర్తిగా పనిచేయనున్నాయి. 12%–18% తేమ ఉన్న పత్తినీ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
రైతులు ఎవరూ ఇబ్బంది పడకుండా శాఖలన్నింటితో సమన్వయం చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో నాణ్యమైన పంటలు పండించేందుకు రైతులు ముందుగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

జగన్ విమర్శలు – ప్రభుత్వం రైతుల పక్షాన
మద్దతు ధరల కోసం గత 16 నెలల్లో ప్రభుత్వం రూ.1000 కోట్లు ఖర్చు చేసిందని, రైతుల సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులపై ప్రేమ లేని జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

కార్యక్రమంలో ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్, అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
