మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి ప్రముఖ సంగీత విద్వాంసుడు, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన డ్రమ్స్ కళాకారుడు శివమణి విచ్చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న ప్రత్యేక సంగీత కచేరీలో తన కళా ప్రదర్శన ఇచ్చేందుకు ఆయన గురువారం క్షేత్రానికి చేరుకున్నారు.

ఆలయానికి చేరుకున్న శివమణికి దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు అంతరాల దర్శనాన్ని ఏర్పాటు చేశారు. వాయులింగేశ్వరుడిని, జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేసి, తీర్థప్రసాదాలను బహూకరించారు.
మహాశివరాత్రి సందర్భంగా శివమణి నిర్వహించనున్న డ్రమ్స్ వాయిద్య ప్రదర్శన భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ కచేరీని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
