విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి నైతిక విలువల విద్యా సదస్సులో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, సమాజంలో మార్పు తేవాలంటే నైతిక విలువలతో కూడిన విద్య అవసరమని అన్నారు. మహిళలను గౌరవించేలా పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేస్తున్నామని, ఇంటిపనుల్లో పురుష–మహిళల సమాన భాగస్వామ్యాన్ని చూపేలా కంటెంట్ సవరించినట్లు తెలిపారు.

చాగంటి కోటేశ్వరరావును కేబినెట్ ర్యాంకుతో నియమించడం నైతిక విలువల బోధనకు ప్రభుత్వ ప్రాధాన్యతకు నిదర్శనమని లోకేష్ పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మంచి పౌరులుగా మారాలని, ఉపాధ్యాయులు దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో మహిళలను అవమానించే సన్నివేశాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. డ్రగ్స్‌పై ప్రభుత్వం యుద్ధం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

విద్యాశాఖను సవాలుగా స్వీకరించినట్లు పేర్కొంటూ, 150 రోజుల్లో 16,347 గురువుల నియామకం, ‘వన్ క్లాస్–వన్ టీచర్’ వంటి సంస్కరణలు చేపట్టినట్లు వివరించారు. కిట్లపై రాజకీయ ప్రచారం లేకుండా చేయడం, నో–బ్యాగ్ డేకి అమలు వంటి చర్యలను గుర్తు చేశారు.

నైతిక విలువల బోధనలో చాగంటి గారి మార్గదర్శకత్వం అవసరమని, ఈ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యం ఉందని లోకేష్ అన్నారు.


