పెళ్లి వేడుకలో సందడి నెలకొన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. మామిడికుదురు మండలం పెదపట్నంలంక గ్రామంలో విద్యుత్ స్తంభం విరిగి పడి మానేపల్లి శ్రీమన్నారాయణ (65) అనే వ్యక్తి దుర్మరణం చెందారు.
గ్రామంలో జరుగుతున్న ఒక పెళ్లి వేడుకలో భాగంగా శ్రీమన్నారాయణ పెళ్లి కుమారుడి ఇంటి వద్ద ‘అవిరేడు ముంత’ ఇచ్చి తిరిగి సైకిల్‌పై వస్తున్నారు. అదే సమయంలో ప్రమాదవశాత్తు ఒక కొబ్బరి చెట్టు విద్యుత్ తీగలపై పడింది. దీంతో తీగలు లాగబడటంతో ట్రాన్స్‌ఫార్మర్‌తో సహా విద్యుత్ స్తంభం ఒక్కసారిగా విరిగి శ్రీమన్నారాయణపై పడింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు ఉన్న మరో వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.తీగలు లాగబడటంతో స్తంభం విరిగిపడటం, అదే సమయంలో శ్రీమన్నారాయణ అక్కడి నుంచి వెళ్లడం చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.
