ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సచివాలయంలో విద్యుత్ శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా, సంస్కరణలు, గత ప్రభుత్వ విధానాలపై చర్చించారు.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన సరఫరా జరగాలి.ట్రాన్స్‌మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించడానికి చర్యలు చేపట్టాలి.విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఎంఓయూలు కుదుర్చుకోవాలి.పీఎం కుసుమ్ సహా సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులు, ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు వేగంగా అమలు కావాలి.ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు 60 రోజుల్లో కార్యాచరణ ప్రారంభించేలా చూడాలి.ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది ప్రోత్సాహకాలు కొనసాగించాలి.
ప్రజల్లోనూ, ప్రభుత్వ శాఖల్లోనూ విద్యుత్ పొదుపుపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
గత ప్రభుత్వంపై విమర్శలు: గత ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలు విద్యుత్ రంగాన్ని అస్తవ్యస్తం చేశాయని సీఎం వ్యాఖ్యానించారు. పీపీఏల రద్దు నిర్ణయంతో ప్రజలపై రూ.9 వేల కోట్ల భారం మోపారని, ఈ పరిస్థితిని కూటమి ప్రభుత్వం సమర్థ నిర్వహణ ద్వారా చక్కదిద్ది, టారిఫ్‌ను పెంచకుండా ప్రజలకు భారం లేకుండా చేసిందని తెలిపారు.
ఈ సమీక్షకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ కె.విజయానంద్, ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు హాజరయ్యారు.
