అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో టాటా నగర్ – ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమయస్ఫూర్తితో లోకో పైలట్ రైలును నిలిపివేయడంతో పెను ప్రాణాపాయం తప్పింది.
టాటా నగర్ నుండి ఎర్నాకుళం వెళ్తున్న రైలులో మొదట B1 భోగిలో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన లోకో పైలట్ తక్షణమే ఎలమంచిలి స్టేషన్ వద్ద రైలును నిలిపివేశారు. మంటలు వేగంగా వ్యాపించడంతో M1, B2 బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మంటలు వ్యాపించకుండా ఇతర కోచ్‌లను వెంటనే రైలు నుండి వేరు చేశారు. రైలు ఆగగానే ప్రయాణికులు భయంతో దిగి పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో రైల్వే అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.అగ్నిప్రమాదానికి గల కారణాలపై రైల్వే ఉన్నతాధికారులు లోతైన విచారణ ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేదా ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
