రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయంలో సీఆర్డీఏ పనుల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు న్యాయం చేయాలని స్పష్టం చేసిన సీఎం, సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు. త్వరలో రైతులతో సమావేశమయ్యేందుకు పురపాలక శాఖ మంత్రి, అధికారులకు సూచనలు ఇచ్చారు.
రాజధాని నిర్మాణాల్లో వేగం, నాణ్యత విషయంలో రాజీ లేకుండా ముందుకు సాగాలని సీఎం ఆదేశించారు. అమరావతిని ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణతో పాటు సీఆర్డీఏ, పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
