తనపై వస్తున్న భూ ఆక్రమణ ఆరోపణలు ముమ్మాటికీ అసత్యమని, రాజకీయ కక్షతోనే కొందరు కావాలని బురదజల్లుతున్నారని గండిగుండం సర్పంచ్, వైసీపీ నాయకులు గండ్రెడ్డి శ్రీనివాసరావు మండిపడ్డారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూమికి సంబంధించిన 1961 నాటి రికార్డులు, డాక్యుమెంట్లను ఆయన మీడియా ముందు ఉంచారు.సర్వే నంబర్ 238/1,2 లోని భూమికి 1961 నుండి పక్కా రికార్డులు ఉన్నాయని, తాము కేవలం 17 సెంట్లు భూమిని మాత్రమే చట్టబద్ధంగా కొనుగోలు చేశామని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు బయటి వ్యక్తులను తీసుకొచ్చి చెల్లని సర్టిఫికెట్లతో కోర్టు నుంచి ఆర్డర్లు పొంది, అక్రమంగా పాకలు వేస్తున్నారని ఆరోపించారు. 2000-2002లో నేషనల్ హైవే విస్తరణ సమయంలో ఈ భూమికి ప్రభుత్వం నష్టపరిహారం కూడా చెల్లించినట్లు రికార్డులు ఉన్నాయని గుర్తు చేశారు. దళితుల భూములను ఆక్రమించినట్లు అసత్య ప్రచారం చేస్తున్న వారిపై, వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా వార్తలు రాస్తున్న సోషల్ మీడియా గ్రూపులపై చట్టపరంగా పరువు నష్టం దావా వేస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు.
తమ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ కాపీలు, గిఫ్ట్ డీడ్‌లు మరియు పట్టాదారు పాస్ పుస్తకాలను ఈ సందర్భంగా ఆయన మీడియాకు ప్రదర్శించారు
