ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల రంగంలో అద్భుతం ఆవిష్కృతమైంది. బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ (NHAI) రికార్డు స్థాయి వేగంతో పనులు పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకుంది. జనవరి 6వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ ఉదయం వరకు కేవలం 6 రోజుల్లోనే 52 కిలోమీటర్ల (156 లేన్ కి.మీ) మేర రోడ్డును నిర్మించి రికార్డు సృష్టించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి పరిధిలో గల వానవోలు-వంకరకుంట-ఓదులపల్లె సెక్షన్‌లో ఈ పనులు జరిగాయి. 57,500 మెట్రిక్ టన్నుల కాంక్రీటును ఉపయోగించి, 70 టిప్పర్లు, 5 మిక్సింగ్ ప్లాంట్లు, 17 రోలర్లతో నిరంతరాయంగా పనులు నిర్వహించి రెండు గిన్నిస్ రికార్డులు సాధించారు. ఒక్క రోజులో 28.896 లేన్ కి.మీ రోడ్డు నిర్మించిన ఘనతతో కలిపి ఈ కారిడార్‌లో ఇప్పటివరకు మొత్తం నాలుగు గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. అత్యంత నాణ్యతతో, రికార్డు వేగంతో పనులు పూర్తి చేసిన నేషనల్ హైవే అథారిటీ అధికారులను, రాజ్ పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఇదే స్ఫూర్తితో ఎకనామిక్ కారిడార్‌లోని మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు.
AP రోడ్ల నిర్మాణంలో గిన్నిస్ రికార్డుల 6 రోజుల్లో 52 కిలోమీటర్ల హైవే పూర్తి
