భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జయంతి వేడుకలను పురస్కరించుకుని గుంటూరులో బీజేపీ శ్రేణులు ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించాయి. 32వ డివిజన్ నుండి మూడవ మండల బిజెపి అధ్యక్షురాలు గాయత్రి బెహరా నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాయత్రి బెహరా ఆధ్వర్యంలో 32వ డివిజన్ నుండి బయలుదేరిన బీజేపీ కార్యకర్తలు, అటల్ జీ నినాదాలతో హోరెత్తిస్తూ విగ్రహ ప్రతిష్టాపన ప్రాంతానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా గాయత్రి బెహరా మాట్లాడుతూ.. అటల్ బిహారీ వాజపేయి గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన బాటలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. నేటి యువతకు వాజపేయి గారి ఆశయాలను, ఆయన దేశాభివృద్ధికి వేసిన పునాదులను తెలియజేయడమే ఈ విగ్రహ ప్రతిష్టాపన ప్రధాన ఉద్దేశ్యమని పార్టీ నేతలు తెలిపారు.
