‘రైతన్న మీకోసం – రైతు వారోత్సవాలలో’ భాగంగా హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత బుధవారం యస్ రాయవరం మండలంలోని గుడివాడ గ్రామంలో పర్యటించారు.
మంత్రి అనిత గుడివాడలోని డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలు, సాగు పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.
రైతులు దేశానికి వెన్నుముక అని పేర్కొన్న మంత్రి, ఎన్డీయే ప్రభుత్వం రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని భరోసా ఇచ్చారు.
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెబుతూ, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని వెల్లడించారు.
రైతులు సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సూచించారు. రాబోయే ఏడాదిలో కనీసం 50 శాతం సేంద్రీయ వ్యవసాయం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
తమలపాకుల రైతులకు అధికంగా నష్టపరిహారం అందజేశామని గుర్తు చేశారు.
బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన మదర్ థెరిస్సా మహిళా సహకార సంఘ సభ్యులకు రూ. 2,54,000 చెక్కును మంత్రి ఈ సందర్భంగా అందజేశారు.
