జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాకలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. కళ్యాణ వేదిక వద్ద నిర్వహించిన కోలాటం, భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పశ్చిమగోదావరికి చెందిన చిన్నారి వెంకట సాయి గాయత్రి చేసిన కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంత్రి అనిత స్వయంగా భక్తులకు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. తన సొంత ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రంలో భక్తులకు మజ్జిగ అందజేసి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. మహిళా భక్తుల మధ్య కూర్చుని సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించిన మంత్రి, చిన్నారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

