ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (A.P.S.R.T.C)లో సంస్కరణల దిశగా కొత్త పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. విజయవాడలో చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంస్థలో 9 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయించారు.సమావేశంలో ఎండీ ద్వారకా తిరుమలరావు, వైస్ చైర్మన్ మునిరత్నం, జోనల్ చైర్మన్లు, బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అద్దె బస్సుల లీజు పరిమితి పెంపు ద్వారా సంస్థకు నష్టం కలిగినట్లు బోర్డు అభిప్రాయపడింది. ఈ నిర్ణయాలపై పూర్తిస్థాయి సమీక్ష జరిపి నివేదికను ప్రభుత్వానికి అందించాలని తీర్మానించింది.విద్యుత్ బస్సుల అమలు, చార్జింగ్ స్టేషన్లు, అవసరమైన సిబ్బంది నియామకంపై కూడా చర్చ జరిగింది.ఉద్యోగుల డిమాండ్లలో భాగంగా కారుణ్య నియామకాలు పునరుద్ధరణ, అపరిమిత వైద్య సదుపాయం పునరుద్ధరణ అంశాలను చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు.
అదనంగా, ఏలూరు జిల్లా చింతలపూడిలో కొత్త బస్ డిపో నిర్మాణ ప్రతిపాదనను విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు సమావేశంలో సూచించారు.

