జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పగలు కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే, ఈ చలి వాతావరణంలో తెల్లవారుజామున వాకింగ్ (నడక) చేయడం ఆరోగ్యం కంటే అనర్థాలకే దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అతి చల్లని గాలిలో నడవడం వల్ల రక్తనాళాలు సంకోచించి, గుండెపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఇది గుండెపోటు వంటి ప్రమాదాలకు కారణం కావొచ్చు. చలిగాలిలో పేరుకుపోయిన కాలుష్య కారకాలు ఊపిరితిత్తుల్లోకి చేరి ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి సమస్యలను తీవ్రం చేస్తాయి.బీపీ, షుగర్ మరియు గుండె జబ్బులు ఉన్నవారు ఎండ వచ్చేవరకు బయట తిరగడం ఏమాత్రం మంచిది కాదు. సూర్యుడు వచ్చిన తర్వాతే వాకింగ్‌కు వెళ్లడం ఉత్తమం. అంతవరకు ఇంట్లోనే యోగా లేదా చిన్నపాటి వ్యాయామాలు చేసుకోవాలని జిమ్ ట్రైనర్లు సూచిస్తున్నారు
