ప్రకాశం జిల్లా: రాచర్ల మండలం, జె.పుల్లలచెరువు గ్రామం సమీపంలోని లింగమయ్య కొండపై చిరుతపులి సంచారం స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. మేతకు వెళ్లిన గేదెలపై చిరుత దాడి చేసింది.
సోమవారం మేత కోసం కొండపైకి వెళ్లిన గేదెలపై చిరుతపులి దాడి చేయగా, ఒక గేదె మృతి చెందింది. మరొక గేదె తీవ్ర గాయాలతో తప్పించుకుంది.
మృతి చెందిన గేదె యజమాని యమ పిచ్చయ్య, గాయపడిన గేదె యజమాని ఉదయగిరి వీరయ్యలు (అనుములపల్లికి చెందినవారు). యజమానులు కేకలు వేయడంతో చిరుత పులి అక్కడి నుంచి పారిపోయింది.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరుత కదలికలను ట్రాక్ చేయడానికి ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే రాత్రి వేళల్లో బయటకు వెళ్లవద్దని, పశువులను అడవి ప్రాంతాలకు దూరంగా ఉంచాలని జాగ్రత్తలు పాటించాల్సిందిగా అధికారులు సూచించారు.
