విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను మారిషస్ దేశ అధ్యక్షుడు ధర్మంబీర్ గొఖోల్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. విదేశీ అతిథికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్, జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి, సీపీ రాజశేఖరబాబు తదితరులు మారిషస్ అధ్యక్షుడికి స్వాగతం పలికారు.

అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ధర్మంబీర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ మర్యాదలతో వారిని ఘనంగా సత్కరించారు.
