దివంగత నేత, మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎర్రన్నాయుడు విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి నివాళులర్పించారు.

ఎర్రన్నాయుడు తనకు అన్నయ్య మాత్రమే కాదని, రాజకీయ జీవితానికి దిక్సూచి అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉత్తరాంధ్ర సమస్యలపై ఎర్రన్నాయుడు ఎలుగెత్తారని, ఆయన అభివృద్ధి దృక్పథం వల్లే శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మారాయని కొనియాడారు.నిబద్ధత, నిజాయితీ కలిగిన రాజకీయాలకు ఆయన చిరునామా అని, ఆయనను చూసి ఎంతో మంది యువకులు రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు పరిశ్రమలు తీసుకురావడం, యువతకు ఉపాధి కల్పించి జిల్లాను ఆర్థికాభివృద్ధి పథంలో నడిపించడమే ఎర్రన్నాయుడు గారికి ఇచ్చే నిజమైన నివాళి అని మంత్రి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో MLAలు బగ్గు రమణమూర్తి, కూన రవికుమార్, బెందాలం అశోక్, గౌతు శిరీష తదితర నేతలు పాల్గొని ఎర్రన్నాయుడు సేవలను స్మరించుకున్నారు.
