ప్రకాశం జిల్లా టంగుటూరు గ్రామంలో మంగళవారం పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కలిసి స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లను వారు ప్రారంభించారు.

గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించిందని మంత్రి ధ్వజమెత్తారు. ఒకవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూనే, మరోవైపు కూటమి ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా అందిస్తోందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు.
ఎన్నికల్లో ఇచ్చిన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, దీపం 2.0 వంటి సూపర్ సిక్స్ హామీలను రికార్డు స్థాయిలో 18 నెలల్లోనే అమలు చేశామన్నారు. హామీ ఇవ్వని అభివృద్ధి పనులను కూడా ప్రభుత్వం చేపడుతోందని మంత్రి వెల్లడించారు.
