రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన మరియు నిరంతరాయ విద్యుత్తును అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో ట్రాన్స్‌కో అధికారులతో కలిసి ఆయన రాష్ట్రవ్యాప్త ప్రాజెక్టుల పురోగతిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రూ. 6,000 కోట్ల విలువైన ట్రాన్స్‌కో ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఈ నిర్మాణాలను నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని మంత్రి కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. గత ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో కీలక పనులు పూర్తి చేశామని, రాబోయే ఏప్రిల్ నాటికి మరో 6 కొత్త ట్రాన్స్‌కో సబ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. రోజువారీగా మారుతున్న మెటీరియల్ ధరలను దృష్టిలో ఉంచుకుని, ప్రాజెక్టుల వ్యయం పెరగకుండా ముందస్తు ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎనర్జీ) విజయానంద్, ట్రాన్స్‌కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

