ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. బుధవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు అడిగిన ప్రశ్నలకు ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
పర్యాటక రంగానికి ‘పారిశ్రామిక హోదా’ కల్పించడంతో కేవలం 18 నెలల్లోనే రూ. 20,088 కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి వెల్లడించారు. దీని ద్వారా సుమారు 39,264 మందికి ఉపాధి లభించనుంది.
ప్రసాద్, స్వదేశీ దర్శన్ 2.0 వంటి కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి రూ. 429.06 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గండికోట అభివృద్ధికి రూ. 77.91 కోట్లు, అఖండ గోదావరికి రూ. 94.44 కోట్లు, సూర్యలంక బీచ్‌కు రూ. 97.52 కోట్లు కేటాయించి పనులు శరవేగంగా చేపడుతున్నామన్నారు. మంగళగిరి, అరసవెల్లి, వాడపల్లి, కోరుకొండ ఆలయాల అభివృద్ధి కోసం కేంద్రానికి కొత్త ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. విశాఖ-అరకు, అమరావతి, తిరుపతి, కోనసీమ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లు, హోమ్ స్టే పాలసీని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.పర్యాటక భూముల వివరాలన్నీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, సరైన డీపీఆర్ (DPR)లతో వచ్చే ఇన్వెస్టర్లకు పార్టీలకతీతంగా సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ ఈ ప్రాజెక్టులను నిరంతరం సమీక్షిస్తోందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.
