పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల మరియు సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్* తెలిపారు. గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం అంబటివలస గ్రామంలో గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మూడు లక్షల గృహప్రవేశాల్లో భాగంగా విజయనగరం జిల్లాలో 8,793 కుటుంబాలు కొత్త ఇళ్లలో అడుగుపెట్టినట్లు ఆయన తెలిపారు. వీటిలో 4,052 ఇళ్లకు ప్రభుత్వం ₹8.11 కోట్లు అదనంగా మంజూరు చేసిందన్నారు. పేదలకు ఇళ్లు కల్పించే పథకాన్ని స్వర్గీయ ఎన్.టి.ఆర్ ప్రారంభించారని, ఇప్పుడు ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని మంత్రి గుర్తుచేశారు.
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుందని, దీని వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు, నూతన వస్త్రాలు అందజేశారు.

