అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన మంగళగిరి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రికను రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘనంగా అభినందించారు. బుధవారం ఉండవల్లి నివాసంలో చంద్రిక తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రిని కలిశారు.

ఇటీవల ఇస్తాంబుల్‌లో జరిగిన ‘ఆసియా ఓపెన్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్’లో చంద్రిక +84 కేజీల సీనియర్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి కాంస్య పతకం (Bronze Medal) సాధించారు. ఈ సందర్భంగా ఆమె ప్రతిభను కొనియాడిన మంత్రి లోకేష్ భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారిణికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.
