ఆంధ్రప్రదేశ్‌లో గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ఏర్పాటు ప్రక్రియపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టతనిచ్చారు. రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు మరియు మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన తాజా సమీక్ష నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనాభా సర్వే (Census) పూర్తయ్యే వరకు డీ-లిమిటేషన్ ప్రక్రియపై నిబంధనలు ఉన్నాయని, సర్వే ముగిశాక గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.
భూసేకరణ భూముల్లో ప్లాట్లు పొందిన వారు మార్చుకోవాలనుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే కొందరికి లాటరీ ద్వారా ప్లాట్లు మార్చినట్లు వెల్లడించారు. భూములను జరీబ్, నాన్-జరీబ్‌గా గుర్తించేందుకు స్టేట్ లెవల్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. 2014 డిసెంబర్ 8 నాటి శాటిలైట్ చిత్రాల ఆధారంగా 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

అమరావతిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్లతో సంబంధం లేకుండా రైతులకు బ్యాంక్ లోన్లు ఇచ్చేలా బ్యాంకులతో మాట్లాడామని మంత్రి చెప్పారు.గ్రామాల్లో మౌలిక సదుపాయాల డిజైన్లు పూర్తయ్యాయని, స్థానిక ఎమ్మెల్యేలు గ్రామ పెద్దలతో చర్చించి ప్రజల సూచనలకు అనుగుణంగా మార్పులు చేస్తారని వివరించారు.
