JANASENA పార్టీలో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖల్లో 100% సక్సెస్ సాధించి ప్రజాక్షేత్రంలో అజేయమైన ఇమేజ్ సంపాదించుకుంటుంటే, మరోవైపు పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారశైలి మరియు నియోజకవర్గాల్లో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ పరిణామాలు జనసేన శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

- ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ ఆగ్రహం
ఇటీవల మంగళగిరిలో జరిగిన జనసేన జనరల్ బాడీ సమావేశంలో పవన్ కళ్యాణ్ తన ఆవేదనను, ఆగ్రహాన్ని నేరుగా వెళ్లగక్కారు. CBI ఛార్జ్‌షీట్ తర్వాత వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని జనసేన నేతలు ఎందుకు ధీటుగా తిప్పికొట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. టీడీపీ శ్రేణులు పోరాడుతుంటే, జనసేన నేతలు మౌనంగా ఉండటంపై మండిపడ్డారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం వంటి వ్యక్తిగత వివాదాలు రోడ్డున పడటం వల్ల పార్టీ ప్రతిష్ట మసకబారుతోందని హెచ్చరించారు. - నియోజకవర్గాల్లో ‘పసుపు’ ఆధిపత్యం?
జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సైతం క్షేత్రస్థాయిలో జనసేన జెండా కంటే తెలుగుదేశం పార్టీ (TDP) జెండాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ, స్థానికంగా రాజకీయ చాణక్యం ప్రదర్శించే వ్యూహకర్తలు లేకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది. అధికారిక కార్యక్రమాల్లో జనసేన ఎమ్మెల్యేలు వెనుకంజలో ఉండటం, నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో జాప్యం వంటివి పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. - ‘జన సైనికుడు’ సైనికుడిగానే మిగిలిపోతాడా?
పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న కార్యకర్తలు, గుర్తింపు ఉన్న నాయకులు సైతం నేడు అధైర్యానికి గురవుతున్నారు. సిద్ధాంతపరంగా మాట్లాడగలిగే నాయకులకు సరైన గుర్తింపు, పదవులు దక్కకపోవడంతో వారు నిరుత్సాహానికి లోనవుతున్నారు.వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడుతుంటే, వాటిని ఎండగట్టడంలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం విఫలమవుతోందన్నది వాస్తవం. “అన్యాయాన్ని ప్రశ్నించకపోతే అది చేతకానితనంగా మారుతుంది” అని పవన్ కళ్యాణ్ ఇచ్చిన హెచ్చరిక పార్టీలో మార్పు తెస్తుందని BNS మీడియా ఆశిస్తోంది. పొరపాట్లను సరిచేసుకుని, కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్‌పైనే కాకుండా, బలమైన వ్యవస్థగా జనసేన ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
