ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APMDC)ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు.
విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని ఉత్తరాంధ్రలో మెటల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. విశాఖలో రాబోయే కంపెనీల నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ సరఫరాపై దృష్టి పెట్టాలని తెలిపారు.
గనుల ద్వారా వచ్చే ఆదాయంలో ఒడిశా అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేసి, వాటిని రాష్ట్రంలో అమలు చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని ఖనిజాలను (లైమ్‌స్టోన్, ఐరన్ ఓర్, మాంగనీస్, క్వార్ట్జ్, గ్రానైట్) ముడిసరుకు రూపంలో ఎగుమతి చేయకుండా, వాటికి వాల్యూ యాడ్ చేసే పరిశ్రమలను (టైటానియం ఉత్పత్తులు, ఫెర్రో అల్లాయిస్, సోలార్ ప్యానెల్స్, గ్లాస్ ఉత్పత్తులు) ప్రోత్సహించాలని సూచించారు.

అక్రమ తవ్వకాలను గుర్తించడానికి ఆర్టీజీఎస్, డ్రోన్, శాటిలైట్ చిత్రాల వంటి వ్యవస్థలను ఉపయోగించుకోవాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇసుక, గ్రావెల్, మెటల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింగిల్ విండో విధానంలో కలెక్టర్ల ద్వారా CRDAకు అందించాలని, ఇసుక సరఫరా సంతృప్తి స్థాయిని పెంచాలని సూచించారు.
సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర మరియు గనుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
